కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్లు వెళితేనే పార్టీకి మంచిది – కొడాలి నాని

వైస్సార్సీపీ పార్టీ కి రాజీనామా చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫై వైస్సార్సీపీ నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు కోటంరెడ్డి వ్యవహారశైలి ఫై స్పందించగా..తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ..శ్రీధర్ రెడ్డి ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఫోన్లు టాప్ చేసే అలవాటు చంద్రబాబు నాయుడుకి ఉందని విమర్శించారు. ఫోన్ ట్యాప్ చేయాల్సిన కర్మ ఎవరికి పట్టలేదు అన్నారు. పార్టీ మారాలనుకున్నాడు కాబట్టే ఫోన్ టాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి కంటే సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారని , చంద్రబాబు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి ఉంటారని అందుకే కోటంరెడ్డి పార్టీ కి రాజీనామా చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యే పరిస్థితి లేదని, ఇక వీళ్లకు మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లంతా పార్టీ నుంచి వెళితేనే మంచిదని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. అంతకు ముందు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫై వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమైన తర్వాతే కోటంరెడ్డి ప్రభుత్వం ఫై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారని రామకృష్ణారెడ్డి అన్నారు.

కొంతమందిని ఎలా లాక్కోవాలో చంద్రబాబుకు బాగా తెలుసని సజ్జల వ్యాఖ్యానించారు. అయినా, ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.’కోటంరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆయనే తన ఉద్దేశాలు వెల్లడించిన తర్వాత ఏం చర్యలు తీసుకోగలం? సీఎం జగన్ ప్రజలను నమ్ముకుని పాలన చేస్తున్నారే తప్ప ఫోన్ ట్యాపింగ్ లను నమ్ముకుని కాదు. ఎవరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చు. పదవి రాలేదన్న అసంతృప్తి ఉండడం వేరు, బహిరంగంగా ఇలాంటి ఆరోపణలు చేయడం వేరు’ అంటూ సజ్జల పేర్కొన్నారు.