జాతీయ పార్టీలతోనే దేశం ఐక్యంగా ఉంటుందిః కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కెసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి

komatireddy-venkat-reddy-comments-on-kcr-govt

హైదరాబాద్‌ః జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ చిన్న పార్టీలే అధికారంలోకి వస్తాయని ముఖ్యమంత్రి కెసిఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ… జాతీయ పార్టీలతోనే దేశం ఐక్యంగా ఉంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలోకి వస్తాయని కేసీఆర్ చెప్పడం సిగ్గుచేటు అన్నారు. చిన్న పార్టీలు గెలిచి ప్రధాని నరేంద్రమోడీకి మద్దతిచ్చి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నారన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, అదానీలకు దోచి పెడుతోందన్నారు. అధికారంలోకి రాకముందు నరేంద్ర మోడీ అందరి అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తానని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. పదేళ్ల నుంచి ఇంతవరకు ఎవరి అకౌంట్‌లోను పైసా వేయలేదన్నారు. అలాగే కనీసం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. కెసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వస్తుందన్న ఆందోళనతో కెసిఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

జాతీయ పార్టీ అని చెప్పి మహారాష్ట్రలో పనికిమాలిన నాయకులను బిఆర్ఎస్‌లో చేర్చుకున్నారన్నారు. వారిని ప్రగతి భవన్‌కు తీసుకు వచ్చి బిర్యానీలు పెట్టాడన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని పక్కదారి పట్టించేందుకు కెసిఆర్ కొత్త నాటకాలు ఆడుతున్నారన్నారు. రైతు రుణమాఫీ చేయడమే లేదన్నారు. తెలంగాణ కోసం ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.