బండి సంజయ్‌ యాత్ర ఫై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

తెలంగాణ మంత్రి కేటీఆర్ ..బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. బండి సంజయ్‌ చేస్తున్నది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. జూటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పచ్చబడుతున్న పాలమూరుపై కక్ష కట్టిన మీకు అక్కడ అడుగుపెట్టే హక్కులేదన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడికి జై కొడుతూ.. పాలమూరు రైతుకు ద్రోహం చేస్తున్న మీరు సిగ్గూ ఎగ్గూ లేకుండా యాత్రలు చేస్తారా..? అని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. పాలమూరుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులపై బోర్డులు బెట్టి బోడిపెత్తనం చేస్తూ.. పండుతున్న పొలాలను ఎండబెట్టాలని కుట్రలు చేసిన వాళ్ళు ఇప్పుడు కపట యాత్రలు చేస్తారా..? అని నిలదీశారు. పాలమూరు ఎత్తి పోతల పథకానికి జాతీయ హూదా ఎందుకు ఇవ్వలేదు? అని నిప్పులు చెరిగారు.

తెలంగాణ పుట్టకముందే కత్తిగట్టిన పార్టీ బీజేపీ అని విమర్శించారు. బండి సంజయ్‌ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రపై మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. ‘పచ్చ బడుతున్న పాలమూరుపై పగ బట్టిన పార్టీకి అధ్యక్షుడైన బండి సంజయ్‌కు అక్కడ అడుగుబెట్టే నైతిక అర్హత లేదు. పాలమూరు గడ్డకు బీజేపీ చేసిన ద్రోహం, ప్రాజెక్టుల మంజూరులో చూపిన నిర్లక్ష్యం, నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం చేసిన వంచనకు పాలమూరు ప్రజానికానికి బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని అని కేటీఆర్ డిమాండ్ చేసారు.