నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు చేసిన బండి సంజయ్

అనంతరం, స్వగృహంలో తన మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకున్న వైనం

Bandi Sanjay did special pooja for the nomination papers

హైదరాబాద్‌ః కరీంనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న బిజెపి అభ్యర్థి బండి సంజయ్ నేడు మహాశక్తి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం తన నివాసానికి వచ్చి అక్కడ తన మాతృమూర్తికి పాదాభివందనం చేశారు.

కాగా, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బండి సంజయ్‌ను ఆయన కార్యాలయంలో కలిసారు. ఇరు నేతలు, పార్టీ కార్యకర్తల నినాదాల నడుమ ఎన్టీఆర్ విగ్రహ చౌరస్తాకు వెళ్లారు. ఈ క్రమంలో నిర్వహించిన ర్యాలీలో పార్టీ కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. రాజాసింగ్‌, తాను.. ధర్మం కోసం పోరాడేవాళ్లమని అన్నారు. తాము కాషాయ జెండా వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు. ధర్మం కోసం పోరాడేది బిజెపి పార్టీ అని.. ధర్మ రక్షణ కోసం పనిచేశానని ఉద్ఘాటించారు. కాషాయ జెండాను తెలంగాణ అంతటా నేను రెపరెపలాడించానని చెప్పారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి పదవి అప్పగించాక.. పార్టీని పరుగులెత్తించానని తెలిపారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీని గెలిపించానని వెల్లడించారు.

‘150 రోజులు ప్రజాసంగ్రామ యాత్ర చేశాను. ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా పోరాడితే నాపై దొంగ కేసులు పెట్టారు. కెసిఆర్‌ నాపై 30 కేసులు పెట్టారు. హిందువులు ఐక్యం కారని ఎందరో హేళన చేశారు. 80 శాతం ప్రజలను ఓటు బ్యాంకుగా మార్చి చూపించాను. నాపై మతతత్వవాది అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులిస్తే.. కెసిఆర్‌ ప్రచారం చేసుకుంటున్నారు. కెసిఆర్‌ తీరు సొమ్ము ఒకడిది, సోకు ఒకడిది అన్నట్లు వ్యవహరిస్తున్నారు. బిజెపి కార్యకర్తలు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలి.’ అని బండి సంజయ్ కోరారు.