అమరావతిపై కొడాలి నాని కీలక కామెంట్స్

ఏపీలో మూడు రాజధానులు అంశం కాకరేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమరావతిపై మాజీ మంత్రి , ఎమ్మెల్యే కొడాలి నాని కీలక కామెంట్స్ చేశారు. అభివృద్ధికి కొలమానం భారీ భవనాల నిర్మాణం కాదని.. జీవన ప్రమాణాలు మెరుగవ్వడం.. అన్ని రంగాల్లోనూ సహజసిద్ధంగా ఎదగడం అసలైన అభివృద్ధి అని వ్యాఖ్యానించారు. వ్యవసాయ, విద్యా, వైద్య రంగాల్లో సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంస్కరణలు ఆ మార్పునకు, అభివృద్ధికి సూచీలుగా నిలిచాయని స్పష్టం చేశారు. అవి ఎందరికో మార్గదర్శకమై.. ఎన్నో పురస్కారాలనూ తెస్తున్నాయని కొడాలి నాని ట్వీట్ చేశారు.

ఆస్తుల కోసమే అమరావతి రైతుల ఆరాటమని, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలది ఆకలి పోరాటమని స్పష్టం చేశారు. తమ ఆస్తులు మాత్రమే పెరగాలని అమరావతి రైతులు, పెట్టుబడిదారులు ఆరాటపడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు సృష్టించిన మాయా లోకమే భ్రమరావతి అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అందరూ బాగుండాలని సీఎం జగన్కో రుకుంటున్నారని.. అమరావతి రైతులు మాత్రం తామే బాగుండాలని విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆరు నూరైనా మూడు రాజధానులను కొనసాగిస్తామని కొడాలి నాని స్పష్టం చేశారు.