మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు ‘డయానా’ అవార్డు

‘శోమ’ పేరుతో ఇటీవల ఓ వీడియో రూపొందించిన హిమాన్షు

హైదరాబాద్: సీఎం కెసిఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావుకు బ్రిటన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక ‘డయానా అవార్డు’ దకింది. ఆహార కల్తీపై అవగాహన కల్పించడంతోపాటు కల్తీలేని ఆహారాన్ని ఉత్పత్తి చేసేలా గ్రామీణుల్ని చైతన్యవంతుల్ని చేయడం, గ్రామాలు స్వయం సమృద్ధి సాధించడం ఎలానో వివరిస్తూ హిమాన్షు ఇటీవల ‘శోమ’ పేరుతో ఓ వీడియో రూపొందించారు. ఈ వీడియోను పరిశీలించిన డయానా ఆర్గనైజేషన్ హిమాన్షుకు అవార్డును ప్రకటించింది.

దివంగత బ్రిటన్ యువరాణి డయానా జ్ఞాపకార్థం చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న 9-25 ఏళ్ల మధ్య వారికి ఈ అవార్డును ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఈ అవార్డు హిమాన్షును వరించింది. తనకు అవార్డు వచ్చిన విషయాన్ని హిమాన్షు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  ‘యువతకు ప్రపంచాన్ని మార్చేశక్తి ఉన్నది’ అనేది సంస్థ నినాదం. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో హిమాన్షు సొంతంగా శోమ (Shoma) పేరు తో ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని గంగాపూర్‌, యూసుఫ్‌ఖాన్‌పల్లిని ఎంపిక చేసుకొని స్పాన్సర్ల సహాయంతో ‘కల్తీలేని ఆహార పదార్థాలు’ తయారుచేసే పరిశ్రమను స్థాపించారు. పరిశ్రమకు కావాల్సిన ముడిపదార్థాలను సేకరించటం, వాటిని ప్రాసెసింగ్‌ చేయటం, ప్యాకింగ్‌ చేయడం వంటి బాధ్యతలన్నీ గ్రామస్థులకు అప్పగించారు. ఇందులో పనిచేసేవారిలో 50 శాతం మంది మహిళలే, ఈ ప్రాజెక్టులో వినియోగించిన యంత్రాలకు పూర్తిగా సౌరవిద్యుత్తునే వాడటం విశేషం. ఈ ప్రాజెక్టుతో యువతకు, మహిళలకు ఉపాధి కల్పించారు. తన ప్రాజెక్టు ద్వారా ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 17 సాధించినట్టు హిమాన్షు వెల్లడించారు. 

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/