మోడీ రామగుండం పర్యటనను అడ్డుకుంటామంటూ విద్యార్థి జేఏసీ ప్రకటన

Student JAC’s announcement that they will block Modi’s visit to Ramagundam

Community-verified icon


ఈ నెల 12 న ప్రధాని మోడీ తెలంగాణ లో పర్యటించబోతున్నారు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌)ను జాతికి అంకితం చేసేందుకు రామగుండానికి రానున్నారు. ఈ క్రమంలో బిజెపి ఆయా ఏర్పాట్లు చేస్తుండగా..వామపక్ష నేతలు, విద్యార్థి జేఏసీ మాత్రం మోడీ పర్యటన ను అడ్డుకుంటామని ప్రకటించాయి.

ప్రధాని మోడీ వస్తే రామగుండం అగ్నిగుండం అవుతుందని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. తక్షణమే యూనివర్సిటీల కామన్ రిక్రూట్‌మెంట్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేసింది. యూనివర్సిటీల కామన్ రిక్రూట్‌మెంట్ బిల్లును ఆమోదించకపోవడం వల్ల యూనివర్సిటీల్లో పెండింగ్ పోస్టుల నియామకం ఆగిపోయిందని, బిల్లు ఆమోదించాల్సిందిగా వెంటనే గవర్నర్‌ను రీకాల్ చేయాలని విద్యార్థి జేఏసీ సూచించింది. అటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కూడా ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని ప్రకటించారు. ప్రధానికి తెలంగాణపై అనుకోని ప్రేమ పుట్టుకొచ్చిందని, దురుద్దేశంతోనే ప్రధాని తెలంగాణ పర్యటనకు వస్తున్నారని ఆరోపించారు.

ఎప్పుడో ఏడాదిన్నర క్రితం ఉత్పత్తి మొదలు పెట్టిన ఎరువుల కర్మాగారమది. ఇప్పటికే పది లక్షల టన్నులకుపైగా ఎరువులను ఉత్పత్తి చేయడమే కాకుండా.. సరఫరా కూడా చేసేసింది. కేంద్రం వాటా కాస్త ఎక్కువ ఉండటంతో లాంఛనంగా దీని ప్రారంభానికి ప్రధానిని పిలిచి.. హంగామా చేద్దామని రాష్ట్ర బీజేపీ నాయకత్వం గంపెడాశలు పెట్టుకుంది అని మరోపక్క టిఆర్ఎస్ ఆరోపిస్తుంది. మొత్తం మీద మోడీ పర్యటన రాష్ట్రంలో హాట్ టాపిక్ అవుతుంది.