ఖమ్మం నుండి మేడారం కు 530 బస్సులు..

తెలంగాణాలో జరిగే అతిపెద్ద, విశిష్ట గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మల జాతర. ఈ జాతర రెండు ఏండ్లకు ఒక సారి జరుగుతుంది, సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 1940 వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే వారు, కాని 1940 తర్వాత తెలంగాణా ప్రజలంతా కలిసి జరుపుకుంటున్నారు. ఏటేట జనం పెరుగుతుండడంతో జాతరను తెలంగాణ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా జరుపుతూ వస్తుంది.

ఈ ఏడాది ఈ మహాజాతర జరగనుంది. ఫిబ్రవరి లో 21 నుంచి 24వ తేదీ వరకు జాతర నిర్వహించనున్నట్లు పూజారులు ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో TSRTC భక్తుల కోసం పెద్ద సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేస్తుంది. ప్రతి డిపో నుండి వందల సంఖ్యలో మేడారం కు బస్సులను ఏర్పాటు చేస్తుంది. అలాగే ఈ బస్సుల్లో మహిళలకు ఫ్రీ పథకం కూడా అమలు చేస్తున్నారు.

భక్తులు సురక్షితంగా చేరుకునేలా ఖమ్మం రీజియన్ నుండి మేడారానికి 530 బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. మహాలక్ష్మి పేరిట మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడంతో ఈసారి రద్దీ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే మునుపెన్నడూ లేని విధంగా ఖమ్మం రీజియన్లో ఏడు డిపోల నుంచి 530 బస్సులు నడిపేలా ప్రణాళిక సిద్ధం చేశారు.