రేపు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ రేపు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆయన ఆహ్వానించారు. రేపు స్పీకర్ సమక్షంలో ప్రమాణం చేస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన రెండవ రోజే బాత్రూంలో కాలు జారి పడటంతో తుంటి ఎముక విరిగిన కేసీఆర్ కు యశోద ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే. తుంటి ఆపరేషన్ కావడంతో డాక్టర్ల సూచన మేరకు కేసీఆర్ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఇటీవల కాలంలో కర్ర సహాయంతో కేసీఆర్ నడవగలుగుతున్నారు. ఈ క్రమంలో కెసిఆర్ ఎమ్మెల్యేగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన మూడు శాసనసభ ఎన్నికలలో కెసిఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా తెలంగాణా రాష్ట్ర పాలన సాగించారు. కానీ ఈ దఫా కేవలం ఎమ్మెల్యేగానే పరిమితం కానున్నారు.

రేపు ఉద‌యం అసెంబ్లీలో స్పీక‌ర్ స‌మ‌క్షంలో ఆయ‌న ప్ర‌మాణం చేయ‌నున్న‌ట్టు పార్టీ తాజాగా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. కాగా, ప్ర‌మాణం చేయ‌క‌పోతే.. ఎమ్మెల్యేగా ఆయ‌న‌కు ఎలాంటి జీత భ‌త్యాలు అంద‌వు. అదేవిధంగా సైన్ ప‌వ‌ర్ కానీ, అధికారిక ఆదేశాలు ఇచ్చేందుకు కానీ.. అవ‌కాశం లేదు. ప్ర‌స్తుతం కేసీఆర్ ప్ర‌మాణం చేయ‌నందున‌.. ఆయ‌న‌కు ఇవేవీ లేకుండా పోయాయి. ఇక‌, ఇదేస‌మ‌యంలో సభ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా కూడా ఆయ‌న‌ను ఎన్నుకోనున్నారు.