చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా జి. కిషన్ రెడ్డి ఈ రోజు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసారు. కిషన్ రెడ్డి కి ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఇతర నేతలతో వచ్చిన కిషన్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అక్కడికి భారీ సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. ఓ కార్యకర్త ఇచ్చిన ఖడ్గాన్ని ఆయన చార్మినార్ ముంగిట ఎత్తి చూపెట్టారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి అంబర్‌పేటలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ముందుగా నిర్ణయించుకున్నట్టు ఉదయం 11.45 గంటలకు బీజేపీ రాష్ట్ర సారథిగా బాధ్యతలు చేపట్టనున్నారు. తరువాత 12.15 గంటలకు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్, బండి సంజయ్, రాష్ట్ర పార్టీ ఇంచార్జులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తో పాటు పార్టీ శ్రేణులు పాల్గొననున్నారు. కిషన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, తెలంగాణ ఏర్పడిన 2014లో ఓసారి ఇప్పటికే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించారు.