ఢిల్లీ లిక్కర్ స్కామ్..కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబుకు బెయిల్‌

షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు

mlc-kavitha-ex-auditor-buchibabu-granted-bail-in-delhi-liquor-scam-case

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబుకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. సోమవారం ఈ మేరకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. రూ.2 లక్షల పూచీకత్తుతోపాటు పాస్ పోర్ట్ సరెండర్ చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం తీహార్ జైలులో బుచ్చిబాబు ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ ఫిబ్రవరి 8న అరెస్టు చేసింది. తొలుత మూడు రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు విధించింది. తర్వాత రెండు సార్లు కస్టడీని పొడిగించింది. ఈ కేసులో బుచ్చిబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ గత బుధవారం కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. వాదనలు విన్న ప్రత్యేక జడ్జి.. తీర్పును వాయిదా వేశారు. తాజాగా బుచ్చిబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు.

లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ నుంచి అభిషేక్‌ బోయినపల్లి తర్వాత సీబీఐ అరెస్టు చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబే. పలుమార్లు బుచ్చిబాబును ప్రశ్నించిన సీబీఐ, ఈడీ.. తర్వాత అరెస్టు చేశాయి. ఇటీవల వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు మాగుంట రాఘవ రెడ్డి కూడా అరెస్టయ్యారు. ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.