ఢిల్లీలో కేసీఆర్ రెండు రోజుల పాటు యాగం

సీఎం కేసీఆర్ దైవాన్ని బాగా నమ్ముతారు. అందుకే నిత్యం యాగాలు , పూజలు చేస్తుంటారు. ఆలా చేస్తుండడం వల్లే కేసీఆర్ అన్నిట్లో విజయం సాదిస్తుంటారని అంత మాట్లాడుకుంటుంటారు. ఇప్పటికే ఎన్నో యాగాలు , యజ్ఞాలు చేసారు. తాజాగా మరోసారి అలాంటి ఓ యాగం చేయబోతున్నట్లు సమాచారం. తాజాగా టిఆర్ఎస్ పార్టీ ని బిఆర్ఎస్ గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 14 న ఢిల్లీ లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారభించబోతున్నారు. ఆలాగే 13 , 14 తేదీల్లో కేసీఆర్ యాగం నిర్వహించ తలపెట్టినట్లు సమాచారం.

బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అవాంతరాలు లేకుండా సక్సెస్ కావాలని , ఢిల్లీ పార్టీ కార్యాలయంలో రెండు రోజుల పాటు రాజశ్యామల యాగాన్ని నిర్వహించనున్నారు. ఈ రెండు రోజుల యాగంలో కేసీఆర్ స్వయంగా పాల్గొననున్నారు. ఇందుకోసం సోమవారం రోజే ఢిల్లీకి చేరుకోనున్నారు. గతంలోనూ.. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. రాష్ట్రం, ప్రజలు అభివృద్ధి చెందాలంటూ.. చంఢీ యాగం నిర్వహించారు. అనంతరం.. రెండో దఫా ఎన్నికలకు వెళ్లే ముందు కూడా సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఆ యాగం తర్వాత ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్.. రెండో సారి కూడా రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌తో కేసీఆర్ తన జాతీయ పార్టీ దేశ రాజకీయాల్లో విజయవంతం కావాలన్న అభీష్టంతో యాగాన్ని నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది.