హాస్పటల్ నుండే షర్మిల సందేశం

వైస్ షర్మిల హాస్పటల్ లో చికిత్స తీసుకుంటూనే ఎమోషనల్ మెసేజ్ పెట్టింది. తన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడం తో షర్మిల తన ఇంటివద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఆమె ఆరోగ్యం క్షిణిస్తుండడంతో పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి హాస్పటల్ కు తరలించారు. ప్రస్తుతం అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆదివారంఆమె హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ఇందులో కీలక అంశాలను పొందుపరిచారు. మంచినీళ్లు కూడా ముట్టకుండా దీక్షను కొనసాగించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయని డాక్టర్లు తెలిపారు.

అర్ధరాత్రి ఒంటిగంటకు షర్మిల హాస్పటల్ లో అడ్మిట్ అయ్యారని పేర్కొన్నారు. అప్పటికే ఆమె లో-బ్లడ్ ప్రెషర్, నీరసం, బలహీనంగా ఉన్నారని చెప్పారు. మంచినీళ్లు గానీ ఇతర ద్రవ పదార్థాలను గానీ తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యారని వివరించారు. ఆర్థోస్టేటిక్ హైపోటెన్షన్‌తో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఆమె శరీరంలో పెద్ద మొత్తంలో ఒలిగ్యురియాను గుర్తించినట్లు డాక్టర్లు ఈ హెల్త్ బులెటిన్‌లో పొందుపరిచారు. అలాగే- మెటబాలిక్ యాసిడోసిస్, ప్రీ-రీనల్ అజొటోమియా సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటోన్నారని, ఆమె శరీరం వైద్యానికి స్పందిస్తోందని డాక్టర్లు తెలిపారు.

ఇదిలా ఉంటె ఆస్పత్రి బెడ్ మీది నుంచే ఆమె మాట్లాడారు. ఆమరణ దీక్ష చేస్తుంటే తనను, పార్టీ కార్యకర్తలను బంధీలను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తలకు, తన అభిమానులకు సందేశం పంపించారు. ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేసిన సమయంలో పోలీసుల చిత్ర హింసలు భరించి.. తనకు అండగా నిలబడిన కార్యకర్తలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ బిడ్డను కేసీఆర్ పంజరంలో పెట్టి బందించవచ్చనుకుంటున్నారు. అది కేసీఆర్ తరం కాదు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. మా కార్యకర్తలను మెడ పట్టుకొని పోలీస్ వ్యాన్లలో ఎక్కించారు. పోలీస్ స్టేషన్‌లో పెట్టి దారుణంగా కొట్టారు. ఇవ్వన్నీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు భరించారు. పోలీసులు ఎన్ని చిత్ర హింసలు పెట్టినా భరించారు. వైఎస్సార్‌పై మీకున్న అభిమానాన్ని మరొక్క సారి నిరూపించుకున్నారు. మీ త్యాగాలను వైఎస్సార్ బిడ్డ ఎన్నటికీ మరవదు. పేరు పేరునా మనస్పూర్తిగా కృతఙ్ఞతలు.” అని వైఎస్ షర్మిల సందేశం పంపారు.