ఈరోజు ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటన..

తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. పర్యటనలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడంతో పాటు రైతులను పరామర్శించనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించి రైతులను కలిసి పరామర్శించి వారికి భరోసా కల్పించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే పంట నష్టం గురించి నివేదికను సిద్ధం చేశారు. అయితే నష్టపోయిన రైతులకు పరిహారం కూడా అందించనున్నట్టు సమాచారం.

పర్యటనలో భాగంగా గురువారం మధ్యాహ్నం 12గంటలకు ఖమ్మం నుంచి హెలీకాప్టర్‌ ద్వారా మహబూబాబాద్‌ జిల్లా పెద్ద వంగర మండలం రెడ్డికుంటతండాకు చేరుకొని అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను స్వయంగా పరిశీలించనున్నారు. రెడ్డికుంట తండా నుంచి హెలీకాప్టర్‌ ద్వారా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం, అడవి రంగాపురానికి చేరుకుని అకాలవర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, బాధితులను ఓదారుస్తారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, పోలీస్, వ్యవసాయ అధికారులు, సంబంధిత ఇతరశాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసారు. ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మేల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు, ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులు సీఎం పర్యటన లో భాగంకానున్నారు.