చర్లపల్లి జైలుకు తీన్మార్ మల్లన్న

జర్నలిస్టు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హత్యాయత్నం కేసు కింద మల్లన్న ను అరెస్ట్ చేయడం జరిగింది. సాయి కరణ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టుగా ఎఫ్‌ఐఆర్ ద్వారా వెల్లడైంది. తీన్మార్ మల్లన్నపై ఐపీసీ సెక్షన్లు 148, 307, 342, 506, 384, 109, r/w 149 కింద కేసులు నమోదు చేసినట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ కాపీని విడుదల చేశారు. తీన్మార్ మల్లన్నతో పాటు మరో నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తీన్మార్ మల్లన్నను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. క్యూ న్యూస్ సిబ్బంది తనను నిర్బంధించి దాడి చేశారని సాయికరణ్ ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్న పోలీసులు తీన్మార్ మల్లన్నతో పాటు ఆయన టీమ్ నలుగురిని అరెస్ట్ చేసినట్లు మేజిస్ట్రేట్ కు తెలిపారు.

విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్‌ను అక్రమంగా కిడ్నాప్ చేసి దాడి చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొమన్నారు. ఫర్జాదీగుడా, రాఘవేంద్ర భవన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులను అడ్డుకొని క్యూ న్యూస్ ఆఫీస్‌కు తీసుకెళ్లి దాడి చేశారు. చైన్ స్నాచర్లు కోసం వెహికల్ చెకింగ్ చేస్తుండగా.. పోలీసులను నిలదీశారు. మీరు ఎవరు..? ఎందుకు వాహనాలు చెక్ చేస్తున్నారని… మీ ఐడీ కార్డు చూపించాలని పోలీసులతో గొడవ పడ్డట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కాగా.. మల్లన్న టీంపై మొత్తం రెండు ఘటనల్లో కేసు నమోదైంది. సాయి కిరణ్ గౌడ్‌పై దాడి చేశారని ఒక కేసు కాగా.. విధుల్లో ఉన్న ఎస్వోటీ పోలీసులపై దాడి చేశారని మరో కేసు నమోదైంది. రెండు కేసుల్లో తీవ్రమైన నేరం చేసినట్టు సెక్షన్‌లను మేడిపల్లి పోలీసులు పేర్కొన్నారు.