హెచ్సీఎల్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న శివ్ నాడార్!

తదుపరి చైర్మన్ గా శివ్ నాడార్ కుమార్తె

Shiv Nadar Steps Down as Chairman of HCL Technologies

ముంబయి: ఐటీ దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్మన్ పదవి నుంచి శివ్ నాడార్ తప్పుకున్నారు. ఆమె కుమార్తె రోషిణీ నాడార్ మల్హోత్రా తదుపరి చైర్మన్ గా నియమితురాలయ్యారు. రోషిణి నియామకం శుక్రవారం నుండి అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా, ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో హెచ్సీఎల్ నికర లాభం గత సంవత్సరంతో పోలిస్తే 31.7 శాతం పెరిగి రూ. 2,925 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం 8.6 శాతం వృద్ధితో రూ. 16,425 కోట్ల నుంచి రూ. 17,841 కోట్లకు పెరిగిందని సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. కాగా, వృద్ధాప్యం కారణంగానే శివ్ నాడార్ తన పదవి నుంచి తప్పుకున్నారని, ఎండీ పదవిలో మాత్రం మరికొంత కాలం కొనసాగుతారని తెలుస్తోంది.

‘వాస్తవానికి ఈ సంవత్సరం మరింత మెరుగైన ఫలితాలు రావాల్సి వుంది. అయితే కరోనా, లాక్ డౌన్ లు మా ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. అయినప్పటికీ ఈ ఫలితాలు సంతృప్తిని కలిగించాయి’ అని హెచ్సీఎల్ సీఈఓ సీ విజయకుమార్ వ్యాఖ్యానించారు. ఈ మూడు నెలల కాలంలో 11 కొత్త కాంట్రాక్టులు వచ్చాయని అన్నారు. ఎన్నో పాత డీల్స్ ను రెన్యువల్ చేశామని చెప్పారు. సమీప భవిష్యత్తులో మరింత వృద్ధి సాధ్యమేనన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. వచ్చే రెండు, మూడు త్రైమాసికాల్లో సంస్థ ఆదాయం 1.5 శాతం నుంచి 2.5 శాతం మేరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు వెల్లడించిన విజయకుమార్, ఈ సందర్భంగా ప్రతి ఈక్విటీ వాటాపై 2 రూపాయల డివిడెండ్ ను అందించనున్నట్టు తెలిపారు. జూన్ నెలాఖరు నాటికి సంస్థలో 1,50,287 మంది పని చేస్తున్నారని, కొత్తగా 7,005 మందిని విధుల్లోకి తీసుకున్నామని అన్నారు. సంస్థను వీడి వెళుతున్న వారి రేటు 14.6 శాతంగా ఉందని వెల్లడించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/