దేశ రాజకీయాల్లో కెసిఆర్ అవసరం చాలా ఉందిః గుత్తా సుఖేందర్‌రెడ్డి

KCR is very much needed in the country’s politics: Gutta Sukhender Reddy

నల్గోండః శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఈరోజు నల్గొండలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఎన్నికల్లో ప్రజలు బిజెపి నిరంకుశ విధానాలను తిప్పికొట్టారని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో లౌకికవాదులు, సిఎం కెసిఆర్‌ గెలిచారన్నారు. మునుగోడులో మతోన్మాద, విచ్ఛిన్నకర క్తులకు చెంపపెట్టులా తీర్పు వచ్చిందన్నారు. ఉప ఎన్నికలు ప్రజల ఆకాంక్షలను వెల్లడించాయని, తెలంగాణలో విచ్ఛిన్నకర శక్తులకు స్థానం లేదని రుజువైందన్నారు. దేశానికి మార్గదర్శనంలా రాజకీయాలు ఉండాలన్నారు.

ఈ ఎన్నికల్లో కేంద్రం ఐటీ డిపార్ట్‌మెంట్‌ను కూడా వాడారని విమర్శించారు. ఇది అత్యంత దుర్మార్గమని, ఇప్పటికే ఈడీ, సీబీఐ నవ్వుల పాలయ్యాయని, తాజాగా ఇన్‌కం టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ను సైతం దిగజార్చారని మండిపడ్డారు. దేశ రాజకీయాల్లో కెసిఆర్ అవసరం చాలా ఉందన్న ఆయన.. సామాన్య ఆకాంక్షలు నెరవేర్చేలా కెసిఆర్ పాటుపడుతారని, ఆయనపై దేశ ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. అన్నిరంగాల్లో తెలంగాణ నేడు నంబర్ వన్ స్థానంలో నిలిచిందని, ఇవాళ తెలంగాణ మోడల్ దేశానికి అవసరమన్నారు. ఈ ఎన్నికతో కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారన్నారు. బలవంతంగా రుద్దిన మునుగోడు ఎన్నికలతో కోమటిరెడ్డి సోదరులు రాజకీయంగా నష్టపోయారన్నారు. పన్నులు వేస్తూ ప్రజలను దోచుకుంటున్న బిజెపికి తగిన బుద్ధి చెప్పారని, సామాన్యులకు శరాఘాతంగా కేంద్ర పాలన మారిందని గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/