మోరంచపల్లిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్‌ను పంపించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్..ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మోరంచపల్లిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్‌ను పంపించాలని ఆదేశాలు జారీ చేసారు.

సీఎం ఆదేశాలతో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ మిలటరీ అధికారులతో సీఎస్‌ శాంతికుమారి సంప్రదింపులు జరిపారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్‌ వినియోగించడం కష్టవుతుండటంతో సైన్యంతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కాగా, మోరంచపల్లిలో సహాయక చర్యల కోసం ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించారు. సైన్యం అనుమతించిన వెంటనే హెలికాప్టర్ ద్వారా కూడా సహాయక చర్యలను చేపట్టనున్నారు.

బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లాలోని మొరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మొరంచపల్లి వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మొరంచపల్లి గ్రామాన్ని వరద ముంచెత్తింది. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో బిల్డింగ్‌లు, చెట్లపైకి ఎక్కి ప్రాణాలను రక్షించుకున్నారు. అంతకంతకు వరద ప్రవాహం పెరిగిపోవడంతో భయాందోళనలకు గురవుతున్నారు.