కొత్తగూడెం కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

కొత్తగూడెం కలెక్టరేట్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఉదయం మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయాన్ని అలాగే బిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్..అక్కడి నుండి నేరుగా హెలికాప్టర్ ద్వారా కొత్తగూడెం చేరుకున్నారు. సీఎం కేసీఆర్ కు జిల్లా నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకోగా.. పోలీసుల నుంచి గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. పూజా కార్యక్రమాల అనంతరం చాంబర్‌లో కలెక్టర్ అనుదీప్‌ను కుర్చీలో కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు తాత మధు, పల్లా రాజేశ్వర్ రెడ్డి లతో పాటు పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజు కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పరిపాలన భవనాన్ని నిర్మించుకున్నాం. నూతన కలెక్టరేట్‌ను నా చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఇక నుంచి మంచి ప్రజా కార్యక్రమాలు జరిగి, ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. కొత్తగూడెంకు కొత్త కలెక్టరేట్, మెడికల్ కాలేజీ వచ్చింది. థర్మల్ పవర్ ప్లాంట్ వచ్చింది. ఇల్లందులో సింగరేణికి తొలి పునాది రాయి పడితే కొత్తగూడెం నుంచి విస్తరించి, సింగరేణి సిరుల కల్పవల్లిగా నిలిచిన గడ్డ కొత్తగూడెం ఇంల్లందు గడ్డ అని కేసీఆర్ పేర్కొన్నారు. కమ్యూనిస్టు విప్లవ భావాలతో అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ, ప్రగతి శీల కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యమ సందర్భంలో నన్ను అక్రమంగా అరెస్టు చేసి ఖమ్మం జిల్లా జైల్లో పెడితే మీరే కాపాడుకున్నారు. మీ అందరి ఆశీర్వాద బలం, ఐక్యపోరాటంతో తెలంగాణ సాధించుకున్నాం అని చెప్పుకొచ్చారు.