సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌కు లేఖ రాసిన రిటైర్డ్ జ‌డ్జీలు

Ex-judges write to CJI to protect sanctity of judicial system

న్యూఢిల్లీ: సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌కు సుప్రీంకోర్టు, హైకోర్టుల‌కు చెందిన 21 మంది రిటైర్డ్ జ‌డ్జీలు ఈరోజు లేఖ రాశారు. కొన్ని వ‌ర్గాలు న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై వ‌త్తిడి తీసుకువ‌స్తున్న‌ట్లు ఆరోపించారు. త‌ప్పుడు స‌మాచారం చేర‌వేస్తున్నార‌న్నారు. రాజ‌కీయ స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం, వ్య‌క్తిగ‌త ల‌బ్ధి కోసం విమ‌ర్శ‌కులు అనుచితంగా మాట్లాడుతున్నార‌ని, న్యాయ వ్య‌వ‌స్థ‌పై ప్ర‌జ‌ల్లో విశ్వాసం త‌గ్గే రీతిలో కామెంట్లు చేస్తున్నార‌ని ఆ లేఖ‌లో రిటైర్డ్ జ‌డ్జీలు ఆరోపించారు. లేఖ రాసిన వారిలో సుప్రీంకోర్టుకు చెందిన న‌లుగురు మాజీ జ‌డ్జీలు ఉన్నారు. అయితే ఏ కార‌ణంగా వాళ్లు ఆ లేఖ రాశార‌న్న దాన్ని వివ‌రించ‌లేదు. అవినీతి కేసుల్లో బీజేపీ, విప‌క్ష పార్టీలు చేస్తున్న కామెంట్లు న్యాయ వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేస్తున్న‌ట్లు ఆ జ‌డ్జీలు ఆరోపించారు.

రాజ‌కీయ నేత‌లు, ఆయా పార్టీలు.. ప‌లు కేసుల్లో రిలీఫ్ కోసం కోర్టుల‌ను ఆశ్ర‌యిస్తున్నాయ‌ని, ఆ క్ర‌మంలో న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ఆయా పార్టీలు, నేత‌లు కించ‌ప‌రుస్తున్నార‌న్నారు. లేఖ రాసిన రిటైర్డ్ జ‌డ్జీల్లో దీప‌క్ వ‌ర్మ‌, కృష్ణ మురారి, దినేశ్ మ‌హేశ్వ‌రి, ఎంఆర్ షా ఉన్నారు. న్యాయ వ్య‌వ‌స్థ‌కు చెందిన‌ కోర్టులు, జ‌డ్జీల‌పై కొంద‌రు అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్లు ఈ న‌లుగురూ పేర్కొన్నారు. కొంద‌రి వ్యాఖ్య‌లు న్యాయ‌స్థాన ప‌విత్ర‌ను, జ‌డ్జీలు నిష్ప‌క్ష‌పాతాన్ని ప్ర‌శ్నిస్తున్న‌ట్లుగా ఉంద‌న్నారు. అనవ‌స‌ర‌మైన వ‌త్తిళ్ల నుంచి న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ర‌క్షించుకోవాల్సి ఉంద‌ని ఆ లేఖ‌లో రిటైర్డ్ జ‌డ్జీలు కోరారు.