భాగ్యనగరంలో మళ్లీ ఐటీ సోదాలు కలకలం

హైదరాబాద్ మహా నగరంలో మరోసారి ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ , బిజినెస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు జరుపుగా..ఇప్పుడు మరోసారి సోదాలు మొదలుపెట్టారు. బాల నగర్ లోని పలు కెమికల్ కంపెనీలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు కెమికల్ కంపెనీలకు సంబంధించి మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ రెండు కంపెనీలు పన్ను ఎగవేతకు పాల్పడినట్టు సమాచారం అందటంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు.. సోదాలు చేపట్టారు. కాగా.. ఢిల్లీ నుంచి మొత్తం ఆరు బృందాలు రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్నారు. వారం రోజుల కిందట హైదరాబాద్‌లో పలు చోట్ల ఐటీ శాఖ సోదాలు కలకలం రేపాయి. సుమారు 20 బృందాలుగా ఏర్పడిన 60 మంది ఐటీ అధికారులు.. ఒకేసారి వివిధ చోట్ల దాడులు నిర్వహించారు.

గచ్చిబౌలి మైండ్ స్పేస్ సమీపంలోని ఎక్సెల్‌ రబ్బర్‌ లిమిటెడ్‌ సంస్థలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇన్‌ఫ్రా, ఐటీ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్, హెల్త్ కేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌ను ఎక్సెల్‌ గ్రూప్‌ నడుపుతోంది. అలాగే.. బాచుపల్లి, చందానగర్‌, కోకాపేట, బాబుఖాన్ లేక్ ఫ్రంట్ విల్లాస్‌లోని అనుబంధ సంస్థల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ సంస్థ ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆదాయ పన్ను అధికారులు సోదాలు జరపటం చర్చనీయంగా మారింది.