సీబీఐ విచారణ పూర్తికాగానే సీఎం కేసీఆర్ తో కవిత భేటీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను సీబీఐ అధికారులు దాదాపు 7 గంటలపాటు విచారించిన సంగతి తెలిసిందే. విచారణ పూర్తి కాగానే ప్రగతి భవన్ కు వెళ్లి తండి కేసీఆర్ తో భేటీ అయ్యారు. సీబీఐ విచారణ తీరుతెన్నులను తండ్రితో చర్చించారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో విచారించిన అనంతరం సీబీఐ స్పందిస్తూ, ప్రస్తుతానికి కవిత విచారణ ముగిసినట్టేనని వెల్లడించింది. ఇప్పటికే అవసరమైన సమాచారాన్ని సేకరించామని, అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని తెలిపింది.
ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు.. దాదాపు ఏడున్నర గంటల పాటు సీబీఐ అధికారులు కవితను ప్రశ్నించారు. మహిళా అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల సీబీఐ టీం.. 160 సీఆర్పీసీ కింద కవిత స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియా రికార్డింగ్ కూడా నిర్వహించినట్లు సమాచారం. ఉదయం నుంచి అడ్వొకేట్ సమక్షంలో అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం భోజన సమయం తర్వాత సీబీఐ అధికారులు అడ్వొకేట్ను బయటకు పంపి.. కవితను విడిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.