నేడు గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం

హాజరుకానున్న మోడీ, 200 మంది సాధువులు!

Gujarat Oath Today, PM, Top Ministers And 200 Saints To Attend

అహ్మాదాబాద్ః గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 182 సీట్లలో బిజెపి 156 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి అఖండ విజయాన్ని సాధించింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి భూపేంద్ర పటేల్ ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా 25 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.

గాంధీనగర్ లో జరగనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. బిజెపి ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వ శర్మ, మనోహన్ లాల్ ఖట్టర్, శివరాజ్ సింగ్ చౌహాన్, బసవరాజ్ బొమ్మై, పుష్కర్ సింగ్ ధామీ, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ లు హాజరుకాబోతున్నారు. వీరితో పాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గుజరాత్ లో ప్రచార బాధ్యతలను నిర్వహించిన సీనియర్ నేత బీఎల్ సంతోష్ లు కూడా హాజరవనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని కనీసం 200 మంది సాధువులు కూడా రానున్నారు.

ప్రమాణస్వీకారం జరగబోతున్న స్థలంలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. మధ్యలో ఉన్న వేదికపై కాబోయే ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ సహచరులు ఆసీనులవుతారు. కుడివైపు ఉన్న వేదికపై ప్రధాని, ఇతర వీవీఐపీలు కూర్చుంటారు. ఎడమవైపు ఉన్న వేదికపై ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డ 200 మంది సాధువులు ఆసీనులవుతారు. 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు సిద్ధమయ్యే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/