టీడీపీ లో తన స్థానం ఫై కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

బిజెపి పార్టీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ..ఈ నెల 23 న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఈ సందర్బంగా టీడీపీ లో తన స్థానం ఫై మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీలో తన పాత్ర ఏమిటనేది పార్టీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని , అధినేత చంద్రబాబు నిర్దేశాలకు అనుగుణంగా నడుచుకుంటానన్నారు.

అలాగే ఇదే క్రమంలో వైస్సార్సీపీ పార్టీ ఫై నిప్పులు చెరిగారు. జగన్ పదవిలోకి వచ్చిన నాటి నుంచీ రాష్ట్రంలో రాక్షస పాలన మొదలైందని, వైస్సార్సీపీ అరాచకాలు చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం వైస్సార్సీపీకి ఉంటే సీఎం ఎందుకు ప్రతిపక్షాల్ని చూసి భయపడుతున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధంగా పోలీసులు విధులు నిర్వహించని పక్షంలో ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు.

జగన్ మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత ధనిక సీఎం అని వ్యాఖ్యానించారు. ఒకసారి ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి ఆపై రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు. నవరత్నాల పేరిట ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. రాజధాని తరలింపు జగన్ దోపిడీ కోసమేనని, అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు.

గత కొంతకాలంగా బిజెపి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కన్నా..రీసెంట్ గా పార్టీ కి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. తాను పార్టీలో ఇమడలేకపోతున్నాని, అందుకే రాజీనామా చేస్తున్నాని ప్రకటించారు.