టీడీపీ లోకి కన్నా లక్ష్మీనారాయణ..ముహూర్తం ఫిక్స్

రీసెంట్ గా బిజెపి కి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ..ఈ నెల 23 న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరబోతున్నారు. టీడీపీలో చేరితేనే తగిన గౌరవం దక్కుతుందని కన్నా అనుచరులు కూడా అభిప్రాయపడ్డారు. దీంతో.. అనుచరుల ఆమోదంతో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ లో చేరేందుకు డిసైడ్ అయ్యారు.

గత కొంతకాలంగా బిజెపి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కన్నా..గత గురువారం పార్టీ కి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. గుంటూరులోని తన నివాసంలో తన అనుచరులతో సమావేశమయ్యారు. తాను పార్టీలో ఇమడలేకపోతున్నాని, అందుకే రాజీనామా చేస్తున్నాని ప్రకటించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన పార్టీని తన సొంత సంస్థలా నడుపుతున్నారని విమర్శించారు. సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత బీజేపీలో పరిస్థితులు మారాయన్నారు. పార్టీ నాయకత్వం సరిగా లేనందువల్లే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. పార్టీతో చర్చించకుండా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ సొంతంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

జీవీఎల్‌ కాపులకు ఏం చేశారని సన్మానాలు చేయించుకుంటున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. EWS పది శాతం కోటాలో కాపులకు ఐదు శాతం అమలుపైనా ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ స్టాండ్‌ ఏంటో చెప్పకుండా రాజ్యసభలో ప్రశ్న వేసి సమాధానం చెప్పించడం ఏంటని కన్నా ప్రశ్నించారు. 2014లో ప్రధాని మోడీ నాయకత్వంపై ఆకర్షితుడినై బీజేపీలో చేరానని కన్నా తెలిపారు. 4 ఏళ్ల పాటు సామన్య కార్యకర్తలా పార్టీలో పనిచేశానని, 2018లో పార్టీ అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు. తన పనితీరు నచ్చే చాలామంది బీజేపీలో చేరరని పేర్కొన్నారు. అమరావతి ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించామన్నారు. కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. అయితే సోము వీర్రాజు అధ్యక్షుడైన తర్వాత పార్టీలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కన్నాతోపాటు మరో 15 మంది నాయకులు పార్టీ నుంచి తప్పుకున్నారు.