ఎంఐఎం గూండాలను కట్టడి చేసే పనిని టీఆర్ఎస్ సర్కారు చేయట్లేదు – బండి సంజయ్

బిజెపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ మరోసారి MIM నేతలపై , టిఆర్ఎస్ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. ఎంఐఎం గూండాలను కట్టడి చేసే పనిని టీఆర్ఎస్ సర్కారు చేయట్లేదని విమర్శించారు. ఈరోజు కరీంనగర్ లోని తన ఇంటివద్ద నిరసన దీక్ష చేపట్టిన సంజయ్..కేసీఆర్ సర్కార్ ఫై విమర్శలు కురిపించారు. ఎంఐఎంతో కలిసి హైదరాబాద్ లో అల్లర్లు చేయించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దమైండు.. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఈ ప్లాన్ జరుగుతోంది. ఎంఐఎం గూండాలను కట్టడి చేసే పనిని టీఆర్ఎస్ సర్కారు చేయట్లేదు. బీజేపీ నాయకులపై దాడి చేయమని ఎంఐఎం గూండాలను రెచ్చగొడుతున్నారని అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కారు ఎన్ని దుష్ట ప్రయత్నాలు చేసినా ప్రజాసంగ్రామ యాత్రను ఆపేది లేదని బండి సంజయ్ స్పష్టం చేశారు.

బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిర్వహించిన నిరసన దీక్ష ముగిసిన సందర్భంగా కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల గడీలను బద్దలు కొట్టేదాకా యాత్ర కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ ఈనెల 27న మధ్యాహ్నం 2 గంటలకు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో జరుగుతుందని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేసినా.. ముగింపు సభను విజయవంతం చేసి తీరుతామన్నారు.