‘జగన్‌ కళ్లు తెరిపిద్దాం’..అంటున్న నారా లోకేష్

nara-lokesh-speech

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ను అరెస్ట్ చేసిన దగ్గరి నుండి వైసీపీ ప్రభుత్వం ఫై టీడీపీ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ..ఆయనకు సంఘీభావం తెలుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇప్పటికే ‘మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు, జగనాసుర దహనం’ కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ తాజాగా మరో వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో ‘అరాచక, చీకటి పాలన సాగిస్తోన్న జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం’ పేరిట మరో వినూత్న నిరసనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 మధ్యలో కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబుకి మద్దతుగా ‘నిజం గెలవాలి’ అని గట్టిగా నినదించాలని కోరారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నారు.