గవర్నర్ ప్రసంగం ఫై బిఆర్ఎస్ అసంతృప్తి

తెలంగాణ అసెంబ్లీ లో ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ చేసిన ప్ర‌సంగం ఫై బిఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసారు. గవర్నర్ ప్రసంగంలో కొత్త‌ద‌నం లేద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే క‌డియం శ్రీహ‌రి అన్నారు. గవర్నర్ గతంలో మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడింది సమీక్ష చేసుకోవాలని సూచించారు.

గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్లు ఉంది. గత పది సంవత్సరాలుగా తెలంగాణ తిరోగమనంలో ఉన్నట్లు గవర్నర్ ప్రసంగం ఉంది. కానీ జాతీయ స్థాయిలో అనేక తెలంగాణ అవార్డులు అందుకున్నది గవర్నర్ మరిచిపోయారు అన్నారు. ప్రజలందరూ ఇప్పుడు సంతోషపడుతున్నట్లు మాట్లాడడం సరైంది కాదు. పది సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చారు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నారు అని చెప్పడం సముచితం కాదు. తెలంగాణ నిర్బంధం నుంచి విముక్తి అయింద‌ని గ‌వ‌ర్న‌ర్ చెప్ప‌డం స‌రికాదు. గ‌వ‌ర్న‌ర్ అబ‌ద్ధాలు చెప్ప‌డం దుర‌దృష్ట‌క‌రం అని కడియం అన్నారు.

మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి సైతం గవర్నర్ ప్రసంగంపై అసంతృప్తి వ్యక్తం చేసారు. ఆర్థిక విధ్వంసం కాదు.. ఆర్థిక స్వాతంత్ర్యం తీసుకొచ్చామ‌న్నారు. అప్పుల పేరుతో ప‌థ‌కాల నుంచి కాంగ్రెస్ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆరు గ్యారెంటీల అమ‌లుపై కాంగ్రెస్ శ్ర‌ద్ధ వ‌హిస్తే మంచిది. విద్యుత్ శాఖ‌లో రూ. 86 వేల కోట్ల అప్పులు చూప‌డం హాస్యాస్ప‌దం. ఆర్బీఐ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి అత్యంత త‌క్కువ రుణాలు తీసుకున్న ప్ర‌భుత్వం కేసీఆర్ ప్ర‌భుత్వం. కాంగ్రెస్ ప్ర‌భుత్వం సాకులు మాని ఇచ్చిన హామీలు అమ‌లు చేయాలి అని నిరంజ‌న్ రెడ్డి డిమాండ్ చేశారు.