పి.గన్నవరం నుండి జనసేన అభ్యర్థి

పి.గన్నవరం రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పోటీ చేస్తున్నట్టు అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా విశ్రాంత పోలీసు అధికారి గిడ్డి సత్యనారాయణ పేరును శనివారం ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తొలి విడత జాబితాలో పి.గన్నవరం స్థానానికి టీడీపీ అభ్యర్థిగా సరిపెల్ల రాజేష్‌ అలియాస్‌ మహాసేన రాజేష్‌ పేరును ప్రకటించారు. అయితే రాజేష్‌ అభ్యర్థిత్వం పట్ల వ్యక్తమైన అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని మార్పు అనివార్యమైంది. టీడీపీ ఖాతాలో ఉన్న ఈ సీటు వ్యూహాత్మకంగా జనసేనకు దక్కింది.

పి.గన్నవరంలో కచ్చితంగా జనసేనే గెలుస్తుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఆ స్థానం నుంచి గిడ్డి సత్యనారాయణ పేరును ప్రకటించిన జనసేనాని.. నేతలు, కార్య కర్తలతో సమావేశమయ్యారు. ‘స్థానిక ఎన్నికల్లో YCP వాళ్లు దౌర్జన్యాలకు పాల్పడి, కనీసం నామినేషన్ వేయనివ్వలేదు. అయినా సత్తా చాటాం. ఇదే స్ఫూర్తిని ఇప్పుడు చూపించాలి. రాబోయే ఎన్నికలు రాష్ట్రం దశదిశను నిర్దేశించేవి. ప్రతి స్థానం కీలకమే’ అని తెలిపారు.