నేడు మౌనదీక్ష చేపట్టనున్న వి.హనుమంతరావు

V. Hanumantha Rao
V. Hanumantha Rao

హైదరాబాద్‌ః కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు నేడు మౌనదీక్ష చేపట్టనున్నారు. అంబర్‌పేటలోని తన నివాసంలో మధ్యాహ్నం మూడు గంటలకు దీక్షకు దిగనున్నారు. తాను బీజేపీకి అనుకూలంగా మాట్లాడినట్టు కొందరు సోషల్ మీడియా వేదికగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా వీహెచ్ మండిపడ్డారు. ఈ అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను తానే రాజకీయాల్లోకి తీసుకొచ్చానని, అయినప్పటికీ ఆయనకు కృతజ్ఞత లేదని మండిపడ్డారు. తనకు ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించిన వీహెచ్‌కు ఆశాభంగం ఎదురైంది. దీంతో ఖమ్మం లోక్‌సభ టికెట్‌ను ఆశించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పెండింగ్‌లో పెట్టిన మూడు స్థానాల్లో ఖమ్మం కూడా ఒకటి. నేడో, రేపో ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఖమ్మం టికెట్‌ పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డికి ఖరారైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి.