చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వకూడదంటూ జోగి రమేశ్ డిమాండ్

చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వకూడదంటూ మంత్రి జోగి రమేశ్ డిమాండ్ చేసారు. చంద్రబాబు ఎక్కడ సభ పెట్టిన ప్రజలు ప్రాణాలు పోతున్నాయని..మొన్న కందుకూరు..నిన్న గుంటూరు సభలలో ప్రజలు ప్రాణాలు బలితీసుకున్నారని రమేష్ అన్నారు.

ఆదివారం గుంటూరులో చంద్రబాబు సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి జోగి రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి చంద్రబాబు చేసిన హత్యలేనని అన్నారు. నాలుగు రోజుల క్రితమే 8 మందిని బలి తీసుకున్న చంద్రబాబు… ఇప్పుడు మరో ముగ్గురుని పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. కొత్త సంవత్సరం రోజున సంతోషంగా గడపాల్సిన వారికి విషాదాన్ని మిగిల్చారని విమర్శించారు. ఈ మరణాలకు కారణమైన చంద్రబాబును అరెస్ట్ చేయాలని అన్నారు. చంద్రబాబు సభలకు అనుమతిని ఇవ్వొద్దని డీజీపీని కోరుతున్నానని అన్నారు. చంద్రబాబును రాష్ట్రంలో తిరగనిస్తే ఆయన మరింత మందిని బలి తీసుకుంటారని విమర్శించారు.