విశ్వవేదికపై తెలుగు సినిమా సత్తా చాటడం పట్ల సినీ , రాజకీయ ప్రముఖుల స్పందన

యావత్ దేశ ప్రజలు గర్వంగా చెప్పుకునే సందర్భం వచ్చేసింది. విశ్వవేదికపై తెలుగు సినిమా సత్తా చాటింది. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటునాటు’కు అవార్డు దక్కింది. ఈ అవార్డు రావడం పట్ల యావత్ సినీ ప్రేక్షకులు , అభిమానులే కాదు రాజకీయ , బిజినెస్ నేతలు సైతం సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

“నా మనసులో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్.ఆర్.ఆర్ గెలవాలి. ఇది ప్రతి ఇండియన్‌కి గర్వకారణం. ఆర్‌ఆర్‌ఆర్‌.. నన్ను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టింది. RRR దేశాన్ని గర్వపడేలా చేసింది.” అని అవార్డు అందుకున్న అనంతరం కీరవాణి బావోద్వేగంతో మాట్లాడారు.

నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మూవీ టీంకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకోవడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. భారత్ కల ఓ వ్యక్తి వల్ల సాకారమైందని అన్నారు చిరు. “భారత్ ఎప్పటికీ ఒక కల అని భావించేది.. కానీ ఓ వ్యక్తి విజన్, ధైర్యం, పట్టుదలతోనే ఇది సాకారమైంది. ఇప్పుడు కోట్ల మంది భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి. ఆర్ఆర్ఆర్ బృందంలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా ” అంటూ చిరంజీవి ట్వీట్ చేసారు.

RRR మూవీ టీంకు ఏపీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు. సంగీత ప్రియులను తట్టిలేపిన ‘నాటు నాటు’ పాటకు ఒరిజినల్ సాంగ్ విభాగంలో గౌరవనీయమైన ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గారు మరియు ఆయన బృందానికి అభినందనలు అన్నారు.

RRR చిత్రానికి ఆస్కార్ అవార్డ్ లభించడం పట్ల తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. RRR చిత్ర నటులు జూనియర్ NTR, రాంచరణ్, డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, చంద్ర బోస్ ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ తో పాటు పలు అవార్డ్ లను అందుకున్న RRR చిత్రం అని వెల్లడించారు. చరిత్రలో మొదటిసారి ఆస్కార్ అవార్డ్ అందుకున్న తెలుగు చిత్రం RRR కావడం ఎంతో గర్వకారణం అని వెల్లడించారు. ఆస్కార్ అవార్డ్ తో విశ్వవ్యాప్తమైన తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి అన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడం చరిత్రాత్మకం అని అన్నారు రేవంత్ రెడ్డి. జక్కన్న బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.