ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త తెలిపిన సీఎం స్టాలిన్

డీఏను 4 శాతం పెంచనున్నట్టు స్టాలిన్ ప్రకటన

tamil-nadu-cm-stalin-nirnay

చెన్నై : కొత్త సంవత్సర కానుకగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీపి కబురు చెప్పారు. కరవు భత్యాన్ని నాలుగు శాతం పెంచుతున్నట్టు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం 34 శాతం డీఏ పొందుతున్నారు. స్టాలిన్ ప్రభుత్వ నిర్ణయంతో డీఏ 38 శాతానికి పెరగనుంది. పెంచిన భత్యాన్ని ఈ ఏడాది జనవరి 1 నుంచే వర్తింపజేయనున్నట్టు సీఎం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్ దారులు లబ్ధిపొందనున్నారు.

మరోవైపు డీఏ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ప్రతి యేటా రూ. 2,359 కోట్ల అదనపు భారం పడనుంది. పెరిగిన డీఏతో ఉద్యోగుల వేతనాలు రూ. 628 నుంచి రూ. 11 వేల వరకు పెరగనున్నాయి. మరోవైపు, పార్ట్ టైమ్ టీచర్లు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు స్టాలిన్ ప్రకటించారు. ఈ కమిటీలో ఆర్థికశాఖ కార్యదర్శి, పాఠశాలల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ తదితరులు సభ్యులుగా ఉంటారని చెప్పారు.