జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ ఇంట విషాదం

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య అనితా గోయల్ గురువారం ఉదయం కన్నుమూశారు. గత కొద్దికాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధడుతున్నారు. ఈ రోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరగనున్నట్టు తెలుస్తోంది. మరోపక్క నరేశ్‌ కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆయనకు ఇటీవలే బెయిల్‌ మంజూరైంది. తనతోపాటు తన భార్య అనిత కూడా క్యాన్సర్‌తో బాధపడుతున్నందున బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన బాంబే హైకోర్టు.. రెండు నెలల తాత్కాలిక ఊరట కల్పించింది. ఇక ఇప్పుడు ఆయన భార్య మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

దేశీయ విమానయాన సంస్థ ‘జెట్‌ ఎయిర్‌వేస్‌’కు కెనరా బ్యాంకు మొత్తం 848.86 కోట్లు రుణం ఇచ్చింది. అయితే అందులో 538.62 కోట్లు కంపెనీ తిరిగి చెల్లించలేదు. దీంతో కెనరా బ్యాంకు కేసు పెట్టింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ చేపట్టింది. జెట్‌ ఎయిర్‌వేస్‌ మోసం చేసినట్లు తేల్చింది. ఈ కేసులో మనీలాండరింగ్‌ అంశాలు తేలడంతో ఈడీ సైతం దర్యాప్తు చేపట్టింది. గతేడాది సెప్టెంబరు 1న నరేశ్‌ గోయల్‌ను అరెస్టు చేసింది.