భాగ్య లక్ష్మి టెంపుల్‌ కు ప్రధాని మోడీ..?

హైదరాబాద్ లోని భాగ్య లక్ష్మి టెంపుల్‌ ను ప్రధాని మోడీ సందర్శిస్తారా..? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే నిన్న ప్రధాని మోడీ ఢిల్లీ లో జీహెచ్ఎంసీ బిజెపి కార్పొరేట‌ర్ల‌తో భేటీ అయ్యారు. కార్పొరేటర్లతో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి అర్బన్‌, గ్రామీణం, మేడ్చల్‌ అర్బన్‌, గ్రామీణం, సికింద్రాబాద్‌, సెంట్రల్‌ జిల్లా అధ్యక్షులు ఈ సమావేశంలో హాజరయ్యారు. దాదాపు గంటకు పైగా ఈ భేటీ జరిగింది. కార్పొరేట‌ర్ల‌ను మోదీ ఆత్మీయంగా పలకరించారు. ప్ర‌తి కార్పొరేట‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చిన మోదీ వారి వివ‌రాలు, వారి కుటుంబ వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారి పిల్ల‌లు, విద్యాభ్యాసం త‌దిత‌రాల‌ను కూడా మోదీ అడిగి తెలుసుకున్నారు.

కార్పొరేటర్ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారని అడిగిన ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రజలకు అందుబాటులో వుంటున్నారా అని ఆరా తీశారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని కార్పొరేటర్లకు సూచించిన ప్రధాని.. జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై ఆరా తీశారు. అంతేకాదు.. హైదరాబాద్ కు త్వరలోనే వస్తా.. మళ్లీ కలుస్తానని జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. అయితే… ఈ సందర్భంగా.. పాత బస్తీలోని భాగ్య లక్ష్మి దేవాలయానికి రావాలని ప్రధాని మోడీని కోరారు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు. దానికి నవ్వుతూ.. చూద్దాం లే అంటూ సమాధానం ఇచ్చారట.

ప్ర‌ధాన మంత్రి హోదాలో ఉన్న నేత నుంచి ఈ త‌ర‌హా ప‌ల‌క‌రింపు ఎదుర‌య్యేస‌రికి జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. గ‌డ‌చిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటార‌ని కార్పొరేట‌ర్ల‌ను మెచ్చుకున్న మోదీ… త్వ‌ర‌లో రానున్న ఎన్నిక‌ల్లో మ‌రింత మేర స‌త్తా చాటాల‌ని సూచించారు. పార్టీ అండ‌గా ఉంటుంద‌ని, హైద‌రాబాద్‌లో బీజేపీని బ‌లోపేతం చేసే దిశ‌గా కృషి చేయాల‌ని ఆయ‌న కార్పొరేట‌ర్ల‌ను కోరారు.