ఉచిత విద్యుత్‌పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు

ఉచిత విద్యుత్‌ అంశం తెలంగాణ లో మంటలు రేపుతోంది. ఉచిత విద్యుత్‌ ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు , నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ శ్రేణులు సైతం బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 8 గంటల కంటే ఎక్కువ ఇవ్వడం లేదంటూ వారు కూడా రోడ్ల పైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ రెండు పార్టీలు ఇలా నిరసనలు చేస్తుంటే..తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.

విద్యుత్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక సీఎం‌ కేసీఆర్ ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత విద్యుత్‌పై కోమటరెడ్డి వెంకటరెడ్డి తప్పా?.. రేవంత్ రెడ్డి కరెక్టా? చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత.. రేవంత్ రెడ్డి బిజినెస్ పార్టనర్స్ అని అన్నారు. మూడు గంటలు కరెంట్ చాలని రేవంత్ రెడ్డికి ఏ రైతు చెప్పారని ప్రశ్నించారు. కేసీఆర్ ఆడిస్తే.. రేవంత్ రెడ్డి ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. రాజకీయంగా రేవంత్ రెడ్డిని పెంచాలో.. తగ్గించాలో.. అంతా కేసీఆర్ చెప్పినట్లు నడుస్తోందని అన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ డబ్బులు పంపుతున్నారంటూ ఆరోపించారు. కాంగ్రెస్ బీ ఫాంలు సీఎం కేసీఆర్ చేతి నుంచే వెళ్తాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి వెళ్ళరని రేవంత్ రెడ్డి గ్యారంటీ ఇవ్వగలరా అంటూ ఎంపీ ధర్మపురి అర్వింద్ హాట్ కామెంట్స్ చేశారు.