సీఎం కేసీఆర్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ

సీఎం కేసీఆర్ తో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్ లో కేసీఆర్ ను కలిశారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు జగ్గారెడ్డి అపాయింట్మెంట్ కోరడంతో, సీఎం ఛాంబర్ లోకి వెళ్లిన తరువాత జగ్గారెడ్డిని పిలిచారు. దీంతో మరోసారి రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. అయితే సీఎంను కలవడంపై జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై విజ్ఞప్తి చేసేందుకు ముఖ్యమంత్రిని కలిశానని క్లారిటీ ఇచ్చారు. సంగారెడ్డి వరకు మెట్రో రైలు వేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. దీంతోపాటు 500 మందికి దళిత బంధు ఇవ్వాలని, మహబూబ్ సాగర్ అభివృద్ధికి, సంగారెడ్డి చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రిని కలవటాన్ని కూడా ఆయన సమర్థించుకున్నారు. ప్రధాని మోదీని కాంగ్రెస్ ఎంపీలు కలిస్తే తప్పు లేనిది తాను సీఎంను కలిస్తే తప్పుందా అని సూటిగా ప్రశ్నించారు. ప్రధానిని కూడా నేరుగానే కాదు… చాటుగా కూడా కలుస్తున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా కొన్ని అంశాల విషయంలో జగ్గారెడ్డి ప్రశంసలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని.. చెప్పిన పని చేసిందంటూ కొనియాడారు. మెడికల్ కాలేజీల ఏర్పాటు గురించి మాట్లాడిన ఆయన… తన నియోజకవర్గంలో మెడికల్ కాలేజీని కేసీఆర్ సర్కార్ నిర్మించిందన్నారు. చెప్పినట్టుగానే మెడికల్ కాలేజీ నిర్మించి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు కూడా చెప్పారు. “మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి కేంద్ర ప్రభుత్వం చాలా నరికింది కానీ.. ఏం చేసింది లేదు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చెప్పినట్టుగానే కాలేజీని నిర్మించిందని చెప్పుకొచ్చారు.