నారా లోకేష్ పాదయాత్రలో విషాదం.. గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్‌ మృతి

యువగళం పేరుతో నారా లోకేష్ గత 13 రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాదయాత్రలో విషాదం చోటుచేసుకుంది. పాదయాత్ర బందోబస్తు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్‌ గుండెపోటుతో మరణించారు.

ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ క్రమంలో పాదయాత్ర సందర్భంగా బందోబస్తు విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్‌కు గుండె పోటు వచ్చింది. దీంతో ఆయన్ను వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ మార్గమధ్యలోనే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రమేష్.. ఐరాల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. పాదయాత్ర కాన్వాయ్ నిర్వహణలో ఉండగా గుండెపోటు వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. మరోపక్క లోకేష్ పాదయాత్రలో పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయగా.. యూజ్ లెస్ ఫెలోస్ అంటూ నారా లోకేష్ పోలీసులను తిట్టారని చెపుతున్నారు.

ఇక లోకేష్ పాదయాత్ర విషయానికి వస్తే..నేడు జీడీ నెల్లూరు నియోజకవర్గం ఆత్మకూరులోని ముత్యాలమ్మ గుడి ఆవరణలోని విడిది కేంద్రం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. ముత్యాలమ్మ గుడిలో లోకేష్ ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం మూర్తినాయకనపల్లి చర్చిలో ప్రార్థనలను నిర్వహించారు. మధ్యాహ్నం సంసిరెడ్డిపల్లెలో భోజన విరామం తీసుకున్నారు. కాగా పాదయాత్ర సందర్భంగా పోలీసుల వైఖరిపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకరిస్తే యువగళం… లేకపోతే రణరంగమే అని హెచ్చరించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసే పోలీసులకు మంచి పోస్టింగ్ లు ఇస్తున్నారని, అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేసే పోలీసులకు పోస్టింగ్ లు ఇవ్వడంలేదని విమర్శించారు. నాటుసారా ఆపాలని మహిళలు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని లోకేశ్ వ్యాఖ్యానించారు.