ఆయిల్ ఫ్యాక్టరీ మృతులకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా…

గురువారం ఉదయం కాకినాడ జిల్లా పెద్దాపురం (మం) జీరాగంపేటలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయిల్ ఫ్యాక్టరీలో ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ఊపిరిఆడక ఏడుగురు కార్మికులు మృతి చెందారు. ప్రమాదంలో మరణించిన ఏడుగురికి ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్లు కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. వీరిలో 5గురు అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరుకు చెందిన వారు కాగా… మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన వారని తెలిపారు. మృతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు.

ఈ ప్రమాదం ఫై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారని వెల్లడించారు. ప్రమాదానికి కారణాలపై సమగ్ర విచారణకు జాయింట్ కలెక్టర్, డిప్యూటీ ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, జిల్లా పరిశ్రమల అధికారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ, పెద్దాపురం ఆర్డీవోలతో కూడిన ఐదుగురులు అధికారుల బృందంతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూడు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఈ బృందాన్ని ఆదేశించామన్న కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. అలాగే ఫ్యాక్టరీ తరపున కూడా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను యాజమాన్యం ప్రకటించింది.