సీఎం పదవికి రాజీనామా చేసిన జగన్

ఎన్నికల్లో భారీ ఓటమి చవిచూసిన జగన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. విజయవాడ రాజభవన్లోని గవర్నర్ నజీర్కు రాజీనామా లేఖను పంపారు. అలాగే ఓటమి ఫై జగన్ ఎమోషనల్ అయ్యారు. లక్షల మందికి ఆసరా ఇచ్చినా, చేయూత అందించినా, అరకోటి మంది రైతులకు భరోసా ఇచ్చినా ఇవాల్టి ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోలు నడిపే డ్రైవర్లకు వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, నా నాయీ బ్రాహ్మణులకు ఇన్ని లక్షల మందికి ఇంతింత మంచి చేసినా ఓడిపోయామని గుండె నుంచి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ మాట్లాడారు.

అమ్మఒడి డబ్బులు ఇచ్చి చిన్న పిల్లలకు మంచి చేసినా, అవ్వాతాతలకు ఇంటివద్దకే పెన్షన్ పంపినా ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. కోటి మందికి పైగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించినా వారు ఆప్యాయత చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల మంది అన్నదాతలకు తోడుగా ఉన్నా వారు తమకు అండగా లేరని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.