జగన్ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు – పవన్ కళ్యాణ్

ఏపీలో భారీ విజయం సాధించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..విజయం అనంతరం మీడియా తో మాట్లాడారు. ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయమని, కక్షసాధింపుల సమయం కాదని కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ సూచించారు. ‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే సమయం. అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉండాల్సిన సమయం. రక్షణ లేని ఆడబిడ్డలకు రక్షణ కల్పించే సమయం. వైఎస్ జగన్ నాకు వ్యక్తిగతంగా శత్రువు కాదు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం పనిచేయడమే నా లక్ష్యం’ అని పవన్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల కోసం తాము పని చేస్తామన్నారు. ఏపీలో చీకటి రోజులు ముగిశాయన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించామని వైసిపిని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టేది లేదన్నారు. సగటు మనిషి కష్టం చూసి తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ కళ్యాణ్, డబ్బు, పేరు కోసం తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు.2019లో పోటీ చేసి రెండు చోట్ల ఓడినప్పుడు నా పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రస్తుతం కూడా అదే పరిస్థితిలో ఉన్నానన్నారు. గెలుపోటములను సమానంగా తీసుకుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆకాశమంత విజయాన్ని ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గం ప్రజలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను అని తెలిపారు.