ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదుః కన్నా లక్ష్మీనారాయణ

పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు తీసుకురావడం లేదన్న కన్నా

Kanna Lakshminarayana
Kanna Lakshminarayana

అమరావతిః సిఎం జగన్ సైకో రెడ్డి అనే విషయాన్ని తాను ముందు నుంచి చెపుతూనే ఉన్నానని టిడిపి నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారని… కానీ, పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు తీసుకురావడం లేదని విమర్శించారు. చంద్రబాబుకు మంచి పేరు వస్తుందనే పట్టసీమ మోటార్లను ఆన్ చేయడం లేదని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదనే ఆలోచనతోనే పట్టిసీమను చంద్రబాబు కట్టించారని చెప్పారు. పోలవరంను వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పూర్తి చేసే అవకాశమే లేదని అన్నారు.

జూలై 20వ తేదీ వచ్చినా కాలువలకు మరమ్మతులు చేయించలేదని… చాలా చోట్ల రైతులే చందాలు వేసుకుని మరమ్మతులు చేయించుకుంటున్నారని చెప్పారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన జగన్ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి, తిరిగి వారిపైనే కేసులు పెట్టే పరిస్థితి ఉందని… పోలీసు ఉన్నతాధికారులు ఇంతలా దిగజారడం గతంలో ఎప్పుడూ చూడలేదని విమర్శించారు.