పథకం ప్రకారమే టిడిపి కార్యాలయాలపై దాడులు..చంద్రబాబు

గన్నవరం పార్టీ ఆఫీసును పరిశీలించిన చంద్రబాబు

chandrababu-visits-gannavaram-tdp-office

అమరావతిః టిడిపి నేతలు, కార్యాలయాలపై ఒక ప్రణాళిక ప్రకారమే దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. మాపైనే దాడులు చేస్తూ, మా వాళ్లనే జైళ్లకు పంపిస్తున్నారని అన్నారు. సైకో ముఖ్యమంత్రి జగన్ కు వత్తాసు పలుకుతున్న పోలీసు అధికారులు జైళ్లకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. రేపు తాను వచ్చిన తర్వాత ఎంక్వైరీలు వేసి ఒక్కొక్కరి సంగతి చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. జగన్ ను నమ్ముకున్న వాళ్లంతా జైళ్లకు వెళ్లారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు.

తనపై దాడి చేశారంటూ టిడిపి నేత పట్టాభిపై స్థానిక సీఐ కేసు పెట్టారని… ఎఫ్ఐఆర్ లో ఆయనను క్రిస్టియన్ అని పేర్కొన్నారని, క్రిస్టియన్ అంటే బీసీ-బీ కేటగిరీ కిందకు వస్తారని, అలాంటప్పుడు ఎస్సీ అట్రసిటీ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. పోలీసులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు ధ్వంసం చేసిన గన్నవరం టిడిపి కార్యాలయాన్ని చంద్రబాబు సందర్శించారు. తగలబెట్టిన కార్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ఆర్‌సిపి నేతలు, పోలీసులపై మండిపడ్డారు.

ఒకరు బెదిరిస్తే పారిపోయే పార్టీ టిడిపి కాదని చంద్రబాబు అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించేవాళ్లమని చెప్పారు. తాను వద్దనుకుంటే రాజశేఖరరెడ్డి, జగన్ పాదయాత్రలు చేసేవారా? అని ప్రశ్నించారు. దొంగదెబ్బ తీయాలనుకోవడం కాదని… దమ్ముంటే నేరుగా ఢీకొనాలని, ఎంత మంది వస్తారో రావాలని సవాల్ విసిరారు. వైఎస్‌ఆర్‌సిపి పాలనలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని… ప్రజల్లో నెలకొన్న భయాన్ని తాము తొలగిస్తామని చెప్పారు.

సైకో పాలనలో ప్రజల ప్రాణాలకు, మహిళల మానాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. వ్యవస్థలకు పట్టిన చీడపురుగులను వదిలించాల్సి ఉందని… వైఎస్‌ఆర్‌సిపి అరాచకాలను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అందరూ తమతో కలిసి రావాలని కోరారు. ప్రజా ఉద్యమానికి ప్రజలే శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఎన్టీఆర్ జిల్లానే ఇలా ఉంటే… పులివెందుల ఇంకెంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. తనను పర్యటించవద్దు అని చెప్పడానికి గన్నవరం పాకిస్థాన్ లో ఉందా? అని మండిపడ్డారు.