పేదల జీవితాల్లో జగన్ వెలుగులు నింపారుః సజ్జల

ఎన్నికల కోసం మారీచ శక్తులు ఏకమయ్యాయని విమర్శ

Jagan has shed light in the lives of the poor: Sajjala

అమరావతిః తండ్రిని మించిన తనయుడిగా ముఖ్యమంత్రి జగన్ పాలన అందిస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొనియాడారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, పేదల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. ఒక్క రూపాయి అవినీతి కూడా లేకుండా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు, ఆసుపత్రులు, గ్రామ సచివాలయాలు ఇలా అన్నింటినీ అందుబాటులోకి తీసుకొచ్చారని అన్నారు. టిడిపి హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారని చెప్పారు. ఈరోజు సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మేరుగ నాగార్జున, లక్ష్మీపార్వతి, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల కోసం మారీచ శక్తులు మళ్లీ ఏకమయ్యాయని సజ్జల విమర్శించారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు, కన్నీళ్లు చూశానని నారా లోకేశ్ అన్నారని… గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఇవి కనపడలేదా అని ప్రశ్నించారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ప్రజలను భ్రమల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో టిడిపికి పవన్ కల్యాణ్ ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎందుకు చేతులు కలిపారని అడిగారు.