ఎమ్మెల్సీ తలశిల రఘురాం స‌తీమ‌ణి భౌతిక‌కాయానికి సీఎం జగన్ నివాళ్లు

వైస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఆయన కుటుంబ సభ్యులను ఏపీ ముఖ్యమంత్రి జగన్ దంపతులు పరామర్శించారు. తలశిల రఘురాం సతీమణి స్వర్ణకుమారి కన్నుమూశారు. ఈ క్రమంలో విజ‌య‌వాడ గొల్ల‌పూడిలోని త‌ల‌శిల ర‌ఘురాం నివాసానికి చేరుకున్న జ‌గ‌న్, వైయ‌స్ భార‌తి దంప‌తులు.. స్వ‌ర్ణ‌కుమారి పార్థీవ‌దేహానికి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ర‌ఘురాంను ప‌రామ‌ర్శించి వారి కుటుంబ స‌భ్యుల‌ను జ‌గ‌న్ దంప‌తులు ఓదార్చారు. అంతకుముందు స్వర్ణకుమారి మరణవార్త తెలిసి సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తలశిల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తలశిల రఘురాం విషయానికి వస్తే.. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్.ఎస్.యు.ఐ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి 1996 నుంచి 2002 వరకు కృష్ణా జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పని చేశాడు. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం వైస్సార్సీపీ పార్టీలో చేరి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శిగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్తగా, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్తగా వివిధ హోదాల్లో పని చేశాడు. తలశిల రఘురాంకు 2021లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో 13 నవంబర్ 2021న పార్టీ ఎమ్మెల్సీగా టికెట్ కేటాయించింది. ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై 8 డిసెంబర్ 2021న ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశాడు. అలాగే వైస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.