మరో వివాదంలో నందమూరి బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ మరో వివాదంలో చిక్కుకున్నారు. రీసెంట్ గా వీరసింహ రెడ్డి సక్సెస్ మీట్ లో అక్కినేని ఫై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపగా..ఇప్పుడిప్పుడే ఆ వివాదాన్ని అంత మరచిపోతుండగా..తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న టాక్ షో అన్‌స్టాప‌బుల్. ఇందులో నర్సుల‌పై బాల‌కృష్ణ అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని ఆ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ఏపీ న‌ర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు స్వ‌చ్చంద ప్ర‌సాద్ తెలిపారు. ఇదే సంద‌ర్భంలో బాల‌కృష్ణ బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ ఆయ‌న డిమాండ్ చేశారు.

అన్‌స్టాప‌బుల్ సీజ‌న్‌లో ప్ర‌సారమైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్‌లో త‌నకు యాక్సిడెంట్ జ‌రిగిన విష‌యం గురించి బాల‌కృష్ణ‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి వివ‌రిస్తున్న సందర్భంలో న‌ర్సు ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. అప్పుడు బాల‌కృష్ణ మాట్లాడిన మాట‌లు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని న‌ర్సుల సంఘం డిమాండ్ చేసింది. ట్రీట్‌మెంట్ ఇచ్చిన నర్సుపై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయని న‌ర్సులు అంటున్నారు.