మరో నలుగురు ఇంచార్జ్ లను ఫైనల్ చేసిన జగన్..?

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ తన దూకుడు పెంచారు. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించిన జగన్..ఈసారి 175 కు 175 సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్న నేతలకు ఈసారి టికెట్ ఇవ్వకుండా..ప్రజల్లో గుర్తింపు ఉన్న నేతలకు టికెట్ ఇవ్వబోతున్నారు. అలాగే పలువుర్ని మార్చడం కూడా చేస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఇంచార్జ్ లను మార్చిన జగన్..తాజాగా మరో నలుగుర్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

జగ్గంపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు కాకుండా..తోట నర్సింహాన్ని ఇన్ చార్జ్ గా ఖరారు చేశారు. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారు. ఆమె కోరికను మన్నించి పిఠాపురం అసెంబ్లీ సీటు కేటాయించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం పిఠాపురంలో పెండెం దొరబాబు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను కాదని ఈసారి అక్కడ వంగా గీతకు అవకాశమిస్తున్నారు. అలాగే రాజమండ్రి రూరల్ నుంచి చెల్లుబోయిన వేణుగోపాల్ ను దించబోతున్నారు. రామచంద్రాపురం నుంచి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను మరోచోటుకు మార్చాలన్న నిర్ణయంతో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాష్ కి అవకాశం ఖాయమైంది. ఇలా ఈ నలుగుర్ని ఫైనల్ చేసినట్లు సమాచారం. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.