ముగిసిన లోకేష్ యువగళం పాదయాత్ర

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా పూర్తి అయ్యింది. విశాఖ జిల్లా అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరించిన లోకేశ్ తన సుదీర్ఘ పాదయాత్రకు ముగింపు పలికారు. సోమవారం నాడు గాజువాక నియోజకవర్గం జీవీఎంసీ వడ్లమూడి జంక్షన్ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. యువనేతతో తల్లి భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరాదేవి, ఇతర కుటుంబసభ్యులు కలసి ఈ పాదయాత్రలో నడిచారు. లోకేష్‌కి సంఘీభావంగా వేలాదిమంది ప్రజలు కలసి నడిచారు. శివాజీనగర్ వద్ద పైలాన్‌ను లోకేష్ ఆవిష్కరించారు. దీంతో గాజువాక ప్రధాన రహదారి జనసంద్రంగా మారింది.

ఇక ఈ నెల 20 న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద పాదయాత్ర విజయోత్సవ సభ కోసం టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజున వేరే కార్యక్రమాలు ఉన్నాయని, తాను హాజరు కాలేనని తొలుత పవన్ టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. అయితే, ఆదివారం రాత్రి పవన్ కల్యాణ్ తో చంద్రబాబు భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రత్యేక ఆహ్వానం మేరకు తాను సభకు హాజరవుతానని పవన్ కల్యాణ్ చెప్పారు. దీంతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ‘యువగళం’ సభకు హాజరవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు 11 నెలల పాటు సాగిన యువగళం పాదయాత్ర సోమవారం విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగిసింది.