నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ ..ప్రధానిని కలిసే అవకాశం

తెలంగాణ రాష్ట్ర సీఎం గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి..ఫస్ట్ టైం ప్రధాని మోడీ ని కలవబోతున్నట్లు తెలుస్తుంది. నేడు రేవంత్ ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ హైకమాండ్ నేతలను కలిసి, అనంతరం అధిష్ఠాన పెద్దలతో కలిసి ప్రధాన మంత్రి మోడీని కలిసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మర్యాదపూర్వకంగా ప్రధాని మోడీని రేవంత్ కలుస్తారని పార్టీ నేతలు వెల్లడించారు.

నిన్న పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై ఇవాళ హైకమాండ్ పెద్దలతో చర్చించబోతున్నారు. అలాగే పదిరోజుల ప్రభుత్వ పాలన ఎలా ఉందో చెప్పబోతున్నారు. ఇక కీలకమైన మంత్రివర్గ విస్తరణపై చర్చించబోతున్నట్లు తెలిసింది. రేపటి నుంచి 22 వరకూ జరిగే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ నెల 24 న లేదా 25న కేబినెట్ విస్తరణ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. దానిపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ఇతరులతో చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలపైనా చర్చ ఉంటుందని సమాచారం.

ప్రధానంగా ఆరు మంత్రి పదవుల పంపకంపై చర్చ సాగుతుందని తెలుస్తోంది. అలాగే నామినేటెడ్ పదవుల భర్తీ అంశం కూడా చర్చిస్తారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మంత్రిమండలిలో 11 మంది మంత్రులున్నారు. మిగతా మంత్రి పదవులపై ఢిల్లీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఐతే.. సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ రాత్రికి తిరిగి హైదరాబాద్ వచ్చేస్తారు.