ఏపీ ప్రభుత్వం పీఆర్‌సీ ప్రకటనతో సంబరాల్లో ఉద్యోగులు..

ఏపీ సర్కార్ పీఆర్‌సీ ప్రకటన చేసి ఉద్యోగుల్లో సంబరాలు నింపింది. కొన్ని నెలలుగా పీఆర్‌సీ ఫై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ త్రూణంలో ఎట్టకేలకు పీఆర్సీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 23.29 శాతం ఫిట్​మెంట్​ను ప్రకటించింది. ఉద్యోగుల విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పీఆర్సీ జూలై 1, 2018 నుంచి అమలు కానుంది. మానిటరీ బెనిఫిట్‌ ఏప్రిల్‌ 1, 2020 నుంచి అమలు కానుంది. సీపీఎస్‌పై జూన్‌ 30లోగా నిర్ణయం తీసుకోనున్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247కోట్ల అదనపు భారం పడనుంది.

గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్‌ 30లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్‌ ప్రక్రియను పూర్తిచేసి, సవరించిన విధంగా రెగ్యులర్‌ జీతాలను (న్యూ పేస్కేలు) ఈ ఏడాది జులై జీతం నుంచి ఇవ్వనున్నారు. సొంతిల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో – ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10శాతం ప్లాట్లను రిజర్వ్‌చేయడమే కాకుండా 20శాతం రిబేటును ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రకటనపై ఉద్యోగ సంఘాలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. పదవీ విరమణ వయస్సు పెంపును ఊహించలేదని చెప్పుకొస్తున్నారు.